వాలంటీర్లందరికీ ఇటీవల ప్రభుత్వం రూ. రెండు వందల జీతం పెంచింది. ఎందుంటే ఆ డబ్బులతో న్యూస్ పేపర్ కొనుక్కుని చదవడానికి. చదువుతారో లేదో కానీ.. కొనాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులిస్తోంది. ఏ పేపరో కొంటే ఊరుకుంటారా సాక్షి పేపరే కొనాలి. ఇలా డబ్బులు ఇస్తున్న వారందరి లిస్ట్ పేపర్ ఏజెంట్లకు పంపి వారికి పేపర్ వేయిస్తున్నారు. అయితే చాలామంది వాలంటీర్లు పేపర్ బిల్లు కట్టడం మానేశారు. ఆ డబ్బులు కూడా తామే వాడుకోవడం ప్రారంభించారు. దీంతో సాక్షి ఏజెంట్లకు పెద్ద చిక్కొచ్చి పడింది.
ప్రజాధనాన్ని సాక్షికి దోచి పెట్టడానికి ప్రభుత్వం ఎంచుకున్న అనేక మార్గాల్లో సాక్షి చందాను వాలంటీర్లతో కట్టించడం ఒకటి. వాలంటీర్లు డబ్బులిచ్చి కొనరు కాబట్టి.. వారికి ప్రభుత్వం రెండు వందలు ఇచ్చి సాక్షిని కొనిపిస్తున్నారు. అలా కొన్ని లక్షల సర్క్యూలేషన్ పెంచుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి దాంట్లోనూ రెండు సాక్షి పత్రికలు వేయిస్తూ మరింత పెంచుకున్నారు. ఆ డబ్బులు కూడా జనానివే. ఇక సాక్షి పత్రికకు వెళ్తున్న ప్రకటనలు వందల కోట్లే. అందరికీ బిల్లులు ఆగుతాయి కానీ.. సాక్షి పత్రికకు మాత్రం ఆగవు. ఇక సాక్షి ఉద్యోగుల్ని.. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చి జీతాలిస్తున్న విషయం కళ్ల ముందే ఉంది.
అయితే వీరి దోపిడికి తాము సహకరిస్తున్నామని వాలంటీర్లు అనుకుంటున్నారేమో కానీ.. ఎక్కువ మంది ఆ సాక్షి పత్రిక వద్దని అంటున్నారు. అధికారికం కాదు కాబట్టి.. వాలంటీర్లు బలవంతంగా వేస్తే బిల్లు కట్టడం లేదు. దీంతో అధికారుల వైపు నుంచి సాక్షి ఏజెంట్లు ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు కట్టకపోతే జీతం కట్ చేస్తామని వాలంటీర్లను బెదిరిస్తున్నారు. పలు చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి.