అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదివరకే చాలాసార్లు చెప్పారు. పాదయాత్ర ముగిసిన తరువాత వైకాపా పత్రిక సాక్షిలో ఓ పేద్ద ఇంటర్వ్యూలో కూడా ఇదే అంశం స్పష్టం చేశారు. జనసేన గురించి నాడు ఆయనే ఒక విశ్లేషణ ఇచ్చారు. జనసేన గత ఎన్నికల్లో టీడీపీకి తోడైంది కాబట్టే, కొద్ది ఓట్ల తేడాతో టీడీపీ గెలుపు సాధ్యమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన సొంతంగా పోరాటం చేస్తోంది కాబట్టి, గతంలో టీడీపీకి ప్లస్ అయిన ఓటు బ్యాంకు అంతా ఇప్పుడు తగ్గుతుందనీ, ఏ పార్టీతో ఎవరు కలిసినా తమకేం నష్టం లేదనీ, జగనే స్వయంగా విశ్లేషించారు. ఇంత ధీమా వ్యక్తం చేసిన తరువాత కూడా.. ఇప్పుడు వైకాపా ఆందోళన చెందుతోంది. టీడీపీ, జనసేన మళ్లీ కలిసిపోతాయేమో అనే టెన్షన్ ఆ పార్టీలో ఉందనడానికి నేటి సాక్షి పత్రికలో వచ్చిన కథనమే సాక్ష్యం.
ముసుగులో సర్దుబాటు అంటూ ఒక కథనం ఇవాళ్ల ప్రచురించారు. దాని సారాంశం ఏంటంటే… సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిపోయిందట, సీట్ల సర్దుబాటు కూడా జరిగిపోయిందట! అంతేకాదు… చంద్రబాబు, పవన్ లు ఈ మధ్య ఓ రహస్య స్థలంలో భేటీ అయ్యారనీ, పారిశ్రామికవేత్త సింగనమల రమేష్ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. అక్కడితో ఆగినా బాగుండేది! పవన్, చంద్రబాబు ఎలా కలుస్తారనీ, ఈ కలయికను ప్రజలు ఒప్పుకోరంటూ విశ్లేషణ కూడా చేసేశారు. గతంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ టీడీపీతో కలిసేందుకు సిద్ధపడుతున్నారని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నట్టుగా కథనంలో రాసేశారు.
వాస్తవానికి, గత కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉంటున్నారు. త్వరలో రాయలసీమ పర్యటన పెట్టుకున్నారు. ఇంకోపక్క, అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నారు. టీడీపీతో కలిసి వెళ్లేది లేదని ఇప్పటికే చాలాసార్లు ఆయన స్పష్టం చేశారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థుల ఎంపికపై తన పనిలో తాను ఉన్నారు. టీడీపీ, జనసేన… కలిసి పోటీ చేస్తాయనే సూచనలుగానీ, సంకేతాలుగానీ రెండు పార్టీల నుంచి లేవు. అలాంటప్పుడు వైకాపాకి ఎందుకింత ఆందోళన? పైగా, రాష్ట్ర ప్రజలందరూ తమకు అధికారం కట్టబెట్టేందుకే సిద్ధంగా ఉన్నారన్న ధీమా ఉన్నప్పుడు… ఇతర పార్టీల మధ్య పొత్తులపై ఇంతగా దృష్టి సారించడమెందుకు..?