వైసీపీలో సీనియర్ నేతలు సైలెంట్ అయిపోగా.. యువనేతలు తిరుగుబాటు సంకేతాలు పంపుతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత పలువురు నేతలు తమ అసంతృప్తి వాయిస్ వినిపించారు. జక్కంపూడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. ధనుంజయ్ రెడ్డిని తమకు అడ్డం పెట్టి నిండా ముంచేశారని అన్నారు. తర్వాత మార్గాని భరత్ కూడా అదే చెబుతున్నారు. జగన్ రెడ్డికి ఏమీ తెలియదని అందుకే లిక్కర్ బ్రాండ్లు..ఇతర విషయాల్లో తప్పులు జరిగాయని చెప్పుకొచ్చారు., ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు.
గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జగన్ తీరుపై అసంతృప్తి కలకలం రేపింది. ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఫలితాలొచ్చిన తరవాత ఆయన ఈవీఎంలు అంటూ వీడియోలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం… కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జగన్ చర్యలను తప్పు పడుతున్నారు. మరికొంత మంది యువ నేతలు… నేరుగా మీడియా ముందుకు రాకపోయినా జగన్ మోహన్ రెడ్డి చేసే రాజకీయంతో తమ రాజకీయ భవిష్యత్ నాశనమైపోయిందని మథనపడుతున్నారు. అందుకే వీలైనంత వరకూ మౌనం పాటిస్తున్నారు. జగన్ ఢిల్లీ ధర్నాకు వెళ్లిన వారిలో ఒకరిద్దరు తప్ప యువనేతలు కనిపించడం లేదు.
రాజకీయ నేపధ్యం ఉన్న … వారసత్వంతో ఎదగాలనుకుంటున్న నేతలు… జగన్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలని డిసైడయ్యారు. వీలైనంత వరకూ మౌనం పాటిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సమర్థించి సమస్యల్లో ఇరుక్కోవడం కన్నా… కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేసి తమపై దృష్టి పడకుండా చేసుకోవచ్చన్న ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఈ వ్యూహాన్నే పాటిస్తున్నారు. జగన్ రెడ్డి వల్ల పార్టీ కోలుకుంటే మళ్లీ ఆ పార్టీ వైపు చూస్తారు.. లేదంటే… తమ దారి తాము చూసుకోవచ్చన్న వ్యూహంలో వారు కొత్త రాజకీయం చేస్తున్నారని అనుకోవచ్చు.