టిక్కెట్ల పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, జగన్ కుటుంబంలో ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెడుతున్నాయి. ఒంగోలు లోక్సభ టిక్కెట్ విషయంలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో.. ఆయన బాబాయి వై.వి.సుబ్బారెడ్డి విబేధించినట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ మరణం తర్వాత కుటుంబపరమైన కార్యక్రమాలన్నింటికీ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు, జగన్ బాబాయ్ అయిన వై.వి.సుబ్బారెడ్డి చూస్తూ ఉంటారు. తాడేపల్లి గృహప్రవేశ కార్యక్రమ ఏర్పాట్లను కూడా ఆయనే చూసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన కానీ… ఆయన కుటుంబసభ్యులు కానీ.. గృహప్రవేశ కార్యక్రమంలో కనిపించలేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత వై.వి.సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి లోటస్పాండ్లో జగన్ను కలిశారని చెబుతున్నారు. ఒంగోలు లోక్సభ టిక్కెట్ మళ్లీ వై.వి.సుబ్బారెడ్డికే ఇవ్వాలని వారంతా కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ సారి ఒంగోలు టిక్కెట్ ఇవ్వలేనని.. పార్టీ కోసం పని చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై కినుక వహించిన… వై.వి కుటుంబసభ్యులు గృహప్రవేశ కార్యక్రమానికి డుమ్మాకొట్టినట్లు చెబుతున్నారు. నిజానికి వై.వి.సుబ్బారెడ్డికి ఈ సారి లోక్సభ టిక్కెట్ ఇవ్వడం లేదని.. ఏడాదిన్నర కిందటే.. జగన్మోహన్ రెడ్డి.. పార్టీలోని ముఖ్యుల ముందు చెప్పినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. కానీ.. వై.వి. మాత్రం టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. ఒంగోలు నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి .. పార్టీలోకి వస్తారని.. ఆయనకే టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో… వై.వి.సుబ్బారెడ్డి మీడియా ముందు ఒక్క సారిగా బ్లాస్టయ్యారు. మాగుంట వచ్చినా.. తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడే కాదు.. 2024లోనూ తనదే టిక్కెట్ అని ప్రకటించారు.
అయితే.. తను ఎంత బయటపడినా… జగన్ మాత్రం.. తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. మాగుంట… వైసీపీలోకి వచ్చినా రాకపోయినా… ఒంగోలు టిక్కెట్ మాత్రం.. వై.వి.సుబ్బారెడ్డికి ఇచ్చే ప్రశ్నే లేదని జగన్ ఫిక్సయిపోయారు. అయితే.. ఆ టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. షర్మిల పేరు చాలా రోజులుగా ప్రచారంలోకి వస్తోంది. బహుశా… ఆమెకే ఖరారు చేయవచ్చని చెబుతున్నారు.