చాలాకాలం తరవాత వైవీఎస్ చౌదరి పేరు మళ్లీ వినిపిస్తోంది. ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. అది కూడా నందమూరి నట వారసుడితో. నందమూరి జాకనీరామ్ తనయుడు ఎన్టీఆర్ ని ఆయన హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి ప్రెస్ మీట్లు కాంట్రవర్సీకి వేదిక అవుతున్నాయి. ఈ సినిమా ప్రకటన కోసం ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్ Q&A సెషన్ హాట్ హాట్ గా సాగింది. పాత్రికేయులు ప్రశ్నలు అడిగితే, సమాధానం చెప్పాల్సింది పోయి, ఎదురు ప్రశ్నలు వేస్తూ వాళ్లని ఉక్కిరి బిక్కిరి చేశారు వైవీఎస్. ఇప్పుడు రెండో ప్రెస్ మీట్ లోనూ అంతే. రిపోర్టర్ ఒక ప్రశ్న వేస్తే, దానికి వైవీఎస్ చౌదరి పది ఉప ప్రశ్నలు జోడించి, ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అనే రీతిలో చెలరేగిపోయారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇష్టమైన మనవడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. ”నందమూరి కుటుంబంలో హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేశారు. మరి ఎన్టీఆర్కు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదు” అనే ప్రశ్న వైవీఎస్ చౌదరికి ఎదురైంది. దీనికి ఆయన సమాధానం సూటిగా చెప్పలేదు. ‘ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని ఎవరు చెప్పారు? ఆయన చెప్పారా, ఎన్టీఆర్ గారే స్వయంగా చెప్పారా’ అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. ఎన్టీఆర్ కు తన మనవళ్లందరూ సమానమే అని, అభిమానులూ అందరినీ సమానంగానే ఆరాధిస్తారని, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని – తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు వైవీఎస్. ఇప్పుడు చేస్తున్న సినిమా హిట్టయితే, ఎన్టీఆర్ కు సరిపడ కథ ఉంటే, తప్పకుండా ఎన్టీఆర్ ని అప్రోచ్ అవుతానన్నారు. తాను ఒక్క కాంపౌండ్ కే చెందిన వాడ్ని కాదని, అక్కినేని, ఘట్టమనేని, కొణిదెల కుటుంబ హీరోలతోనూ సినిమాలు చేశానని గుర్తు చేశారు వైవీఎస్.
మొత్తానికి వైవీఎస్ చేస్తున్న సినిమా మాటేమో గానీ, ఈ ప్రెస్ మీట్ల వల్ల, అందులో ఆయన ఇస్తున్న సమాధానాల వల్ల… మరింత హైలెట్ అవుతున్నారు. ఈ ప్రవాహం మున్ముందూ ఇలానే కొనసాగుతుందేమో చూడాలి.