నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు ఎన్టీఆర్లు వచ్చారు. ఒకరు అన్న నందమూరి తారక రామారావు అయితే, మరొకరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు మూడో ఎన్టీఆర్ కూడా తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. నందమూరి జానకీరామ్ తనయుడు ఎన్టీఆర్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా వీణారావు ఎంపికైంది. సంగీత దర్శకుడిగా కీరవాణి పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా విశేషాల్ని ప్రెస్ మీట్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వైవీఎస్. అయితే హీరో, హీరోయిన్లని ఇప్పటి వరకూ పరిచయం చేయలేదు. ఇప్పుడు అందుకు మార్గం సుగమం అయ్యింది.
దసరా సందర్భంగా ఎన్టీఆర్, వీణారావులను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని వైవీఎస్ ప్రకటించారు. ఆ రోజు హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారాయన. ఇప్పటికే ఎన్టీఆర్ నటనకు సంబంధించిన శిక్షణ తీసుకొంటున్నారు. వైవీఎస్ పర్యవేక్షణలోనే ఈ శిక్షణ సాగుతోంది. దసరా తరవాత షూటింగ్ ప్రారంభిస్తారు. తెలుగుదనం, సంప్రదాయాలూ ఉట్టిపడేలా, ఓ పిరియాడికల్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వైవీఎస్ ఇది వరకే ప్రకటించారు. టైటిల్ కూడా అచ్చ తెలుగులోనే ఉంటుందట. టైటిల్ వివరాలు కూడా అతి త్వరలోనే వెల్లడించబోతున్నట్టు సమాచారం.